నిరుద్యోగులకు త్వరలో శుభవార్త

88
job
- Advertisement -

కొలువుల జాతర ఈ నెలలోనే మొదలు కాబోతోంది. అన్నీ సవ్యంగా సాగితే త్వరలో కొత్త ఉద్యోగాల నగారా మోగనుంది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన దాదాపు పూర్తైంది. జిల్లాకు 20 శాతానికి తగ్గకుండా ఖాళీలు ఉండే విధంగా జిల్లా క్యాడర్ ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ జరిగింది. దీంతో ఇక జాబ్ నోటిఫికేషన్ల పర్వం షురూ కానుంది. నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పే దిశలో కసరత్తు చేస్తూ ఉద్యోగాల ప్రకటనకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

నిరుద్యోగులకు త్వరలో శుభవార్త వెలువడనుంది. ఏళ్లపాటు కొనసాగిన వాళ్ళ నిరీక్షణ ఫలించనుంది. కొత్త ఉద్యోగాల భర్తీకోసం ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. కొత్త జోనల్ వ్యవస్థకనుగుణంగా ఉద్యోగుల విభజన పూర్తయ్యాక నియామకాలు చేపడతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జిల్లాల్లో ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియను గత డిసెంబర్లో చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ దాదాపు పూర్తియినట్లే. స్పౌజ్ కేసులు, అప్పీళ్లు కూడా ప్రభుత్వానికి తక్కువ సంఖ్యలోనే అందాయి. ఒకటి రెండు రోజుల్లో అవి కూడా పరిష్కారం కానున్నాయి. అటు పరస్పర బదిలీలకు కూడా సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లాకు కనీసం 20 శాతానికి తగ్గకుండా ఖాళీలు ఉండే విధంగా విభజనలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ఈ ప్రక్రియంతా పూర్తికానున్న నేపథ్యంలో కొత్త నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, ఇతర ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా ఉన్న ఖాళీల వివరాలను సీఎం ఈ సందర్భంగా ఆరా తీసినట్లు తెలిసింది. గతంలో ఇచ్చిన సంఖ్యతో ఉద్యోగుల విభజన తరవాత ఏర్పడిన ఖాళీల వివరాలను అధికారులు సరి చూసి, వాటిని క్రోడీకరిస్తున్నారు. తొందర్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకేసారి 50 వేల పై చిలుకు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత వేగంగా కసరత్తు పూర్తి చేసి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వీలైతే ఈ నెలలోనే కొన్ని నోటిఫికేషన్లు వెలువరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు వినికిడి.

- Advertisement -