ఈనెలలోనే జాబుల జాతర..

53
kcr
- Advertisement -

కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కసరత్తు నడుస్తోంది. ఇందుకోసం సీఎంఓ కార్యదర్శి శేషాద్రి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కొత్త జిల్లాల వారీగా క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, ఖాళీల గుర్తింపుపై దృష్టిసారించింది. అన్నిచోట్లా కనీసం 20% వేకెన్సీలు ఉండేలా సర్కారు మదింపు చేస్తోంది. ఆ లెక్కన దాదాపు 60 వేల ఖాళీల సమాచారం కమిటీకి అందింది. మిగిలిన ప్రక్రియ పూర్తవగానే ఆ వివరాలను ఐఏఎస్ ల కమిటీ మంత్రివర్గానికి నివేదించనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కానుకగా సర్కారు కొలువుల నగారా మోగనుంది. కనీసం 50 వేలకు తగ్గకుండా టీఎస్పీఎస్సీ నుంచి దశలవారీగా వరుస ప్రకటనలు వెలువడనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల సమాచారం సేకరించడానికి సీఎంఓ కార్యదర్శి శేషాద్రి నేతృత్వంలో ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, దివ్య, లోకేష్ కుమార్ సభ్యులుగా ఏర్పాటైన కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాల వారిగా క్యాడర్ స్ట్రెంత్ కు అనుగుణంగా ఏర్పడుతున్న వేకెన్సీలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే దాదాపు 60 వేల ఖాళీల వివరాలు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త నియామకాల్లో 95% ఉద్యోగాలు స్థానికులకే వచ్చే విధంగా 2018 రాష్ట్రపతి ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో కేంద్ర ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. పరిపాలనాపరమైన సౌకభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను పీఓ 2018 ద్వారా రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే కొత్త జోనల్ వ్యవస్థలకు అనుసంధానం చేసింది. ఆమేరకు ఉద్యోగుల విభజన, కేటాయింపులను 317 జీవో మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం విజయవంతంగా పూర్తిచేసింది. 95% పైగా ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేటాయింపులు జరిగిపోయి ఉద్యోగులు కొత్త ప్రాంతాల్లో విధుల్లో కూడా చేరిపోతున్నారు. కేవలం పదుల సంఖ్యలో మిగిలిపోయి, కొత్త ప్రాంతాల్లో జాయిన్ అవని ఎంప్లాయిస్ కు ముందు షోకాజ్ నోటీసులు అందించి, కొంత గడువు కూడా ఇచ్చి అవసరమైన పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐతే ఇలాంటి వాళ్ళు కేవలం 50 మంది లోపు ఉంటారని అంచనా.

భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా స్పౌజ్ కేసులు, ఇతర అభ్యంతరాలతో కూడిన అప్పీళ్ల పరిష్కార ప్రక్రియ తుదిదశలో ఉంది. ఖాళీలు ఉంటేనే స్పౌజ్ ఇష్యూస్ ను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త స్థానికత ఆధారంగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్లోని ఖాళీలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. పోస్టింగుల ప్రక్రియ పూర్తైన తరవాత జిల్లాల వారిగా ఉన్న ఖాళీల సమాచారం ప్రభుత్వానికి అందింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంత్ ఖరారు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కనీసం 20% ఖాళీలు ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఫోర్త్ క్లాస్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో సహా జిల్లాలవారిగా లెక్కతేలే వేకెన్సీలను క్రోడీకరించి, ఆ జాబితాను ప్రభుత్వం క్యాబినెట్ ముందు ఉంచనుంది. ఆ తరవాత మంత్రివర్గ ఆమోదంతో కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్పీఎస్సీ చేపట్టనుంది. ఫిబ్రవరి మూడో వారం లేదా నాలుగో వారం నుంచి గవర్నమెంట్ జాబుల జాతర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -