తెలంగాణను నెంబర్‌ 1గా నిలబెడతాం:రేవంత్

10
- Advertisement -

రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమించి ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని బలంగా విశ్వస్తాను. మాకు సంకల్పం ఉంది. అందుకు అవసరమైన విజన్ ఉంది. ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాం. ప్రజల అండతో లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించం.. అని గోల్కొండ వేదికగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉద్ఘాటించారు.

79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ రాణిమహల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి గారు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ సమగ్రాభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికను ఆవిష్కరించారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం పనిచేద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. కుల గణనతో బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం అన్నారు.

పరిపాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ 20 నెలల కాలంలో #Telangana ను దేశానికి రోల్ మాడల్‌గా నిలబెట్టాం… పేద ప్రజల ఆహార భద్రతకు భరోసాగా ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాం అన్నారు. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేపట్టాం. నిరుపేదల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే పథకంతో పేదల కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం శాశ్వతంగా గుర్తుంటుంది. అలాగే ఈ ఏడాది జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం అన్నారు.

వరంగల్ వేదికగా 2022 మే 6 న ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర సృష్టించాం. రైతుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12 వేల చొప్పున జూన్ 16 న కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల పెట్టుబడి సాయం అందించాం. దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా తెలంగాణ రైతాంగాన్ని ప్రోత్సహించాం అని తెలిపారు.

- Advertisement -