తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం 2026–27 నుంచి ఇంటర్మీడియట్ గణిత పరీక్షా విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 75 మార్కుల రాత పరీక్ష విధానాన్ని రద్దు చేసి, ఇకపై గణితానికి కేవలం 60 మార్కులకే రాత పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. గణితం పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తగ్గించి, అనవసర ఒత్తిడిని తొలగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మార్పులు మొదటగా ఎంపీసీ (MPC), ఎంఈసీ (MEC) గ్రూపుల విద్యార్థులకు వర్తించనున్నాయి.
సీబీఎస్‌ఈ తరహాలో ఇంటర్నల్ అసెస్‌మెంట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. రాత పరీక్షకు 60 మార్కులు కేటాయించగా, మిగిలిన 15 మార్కులను ఇంటర్నల్ మార్కులుగా ఇవ్వనున్నారు. క్లాస్ రూమ్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ వర్క్, అసైన్‌మెంట్ల ఆధారంగా ఈ మార్కులు కేటాయిస్తారు. దీనివల్ల విద్యార్థులు ఏడాది పొడవునా చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది.
ఇకపై ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు ఒకే సిలబస్ కాకుండా స్వల్ప మార్పులతో వేర్వేరు ప్రశ్నపత్రాలు రూపొందించాలన్న ఆలోచనలో బోర్డు ఉంది. ఎంపీసీ విద్యార్థులకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు ఉపయోగపడేలా, ఎంఈసీ విద్యార్థులకు వాణిజ్య, నిర్వహణ కోర్సులకు అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించనున్నారు. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించి కొత్త కరికులమ్ సిద్ధం చేయాలని యోచిస్తున్నారు.
Also Read:న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్

