తెలంగాణ హైకోర్టు కీలకమైన, సంచలనాత్మక తీర్పును వెలువరించింది. భార్య వంట చేయకపోవడం, అత్తకు సాయం చేయకపోవడం వంటి కారణాలను క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ కారణాలతో విడాకులు మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టంగా వ్యాఖ్యానించింది.
హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి, తన భార్య వంట చేయడం లేదని, తల్లికి సహకరించడం లేదని, తరచూ పుట్టింటికి వెళ్తోందని పేర్కొంటూ కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్య ప్రవర్తన వల్ల తాను మానసిక హింసకు గురవుతున్నానని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితుల్లో, ఇంటి పనులు చేయలేదనే ఒక్క కారణంతో భార్యపై క్రూరత్వం ఆరోపించడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మారుతున్న సామాజిక పరిస్థితులు, జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని న్యాయవ్యవస్థ ముందుకు సాగాలని పేర్కొంది. పెళ్లైన తర్వాత చిన్న చిన్న మనస్పర్థలు సహజమేనని, వాటిని విడాకులకు కారణాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు మహిళల హక్కుల పరిరక్షణలో కీలకమైనదిగా, సమాజంలో అవగాహన పెంచేదిగా న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:ఫాస్టింగ్‌పై అధ్యయనం..షాకింగ్ నిజాలు!

