తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వేడి మరింతగా పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 39.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నిజామాబాద్ లో 38 డిగ్రీలు నమోదు కాగా, మహబూబ్‌నగర్ లో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాజధాని హైదరాబాద్‌లో కూడా వేడి తీవ్రత పెరుగుతోంది. నగరంలో 37.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని బేగంపేట, రాజేంద్రనగర్, హయాత్ నగర్ ప్రాంతాల్లో 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇతర జిల్లాల్లో కూడా వేడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మెదక్ లో 36.2 డిగ్రీలు,రామగుండంలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే పటాన్‌చెరులో 36.2 డిగ్రీలు నమోదు కాగా, నల్గొండలో 35.8 డిగ్రీలు నమోదయ్యాయి.
దక్షిణ తెలంగాణలోని ఖమ్మంలో 35 డిగ్రీలు నమోదు కాగా, భద్రాచలంలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Also Read;యుద్ధంపై తప్పుడు ప్రచారం..కఠిన చర్యలు
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, వచ్చే మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ఎక్కువగా నీరు తాగాలని, వేడి నుంచి రక్షణ కోసం తేలికపాటి దుస్తులు ధరించాలని సూచించారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అలాగే వ్యవసాయ కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.

