తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

256
Gram Panchayat Election
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఈ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు ఆయన సచివాలయంలో మీడియా ద్వారా తెలిపారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, జనవరి 30న మూడో విడత పోలింగ్‌జరుగుతుందన్నారు.

తొలి విడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21తో ముగుస్తుందని, రెండో విడత ఈ నెల 11న ప్రారంభమై 25తో, మూడో విడత 16న ప్రారంభమై 30తో ముగుస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో మొత్తం 12,732 గ్రామ పంచాయతీలు.. 1,13,170 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,13, 190 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Gram Panchayat Election

పోలింగ్‌ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, పోలింగ్‌ రోజే ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని స్పష్టంచేశారు. తొలి విడతలో 4480 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో 4137 పంచాయతీలకు, మూడో విడతలో 4115 గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహిస్తామని ఈసీ నాగిరెడ్డి తెలియజేశారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం జనరల్ అభ్యర్థి రూ.2వేలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులు.. జనరల్ రూ.500.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250 డిపాజిట్ చేయవల్సి ఉంటుంది. రాష్ట్రంలో 12,571 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కొత్తగా ఏర్పడిన గిరిజన పంచాయతీల్లో కోలాహలం నెలకొన్నది.

- Advertisement -