దేశ వ్యవసాయ రంగం లో తెలంగాణా సరికొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేలా రైతు పెట్టుబడితో పాటు రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు ఆర్ధికంగా చేయూతనందించేందుకు గత ఏడాది రైతు బీమాను ప్రారంభించింది. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం అందివ్వనున్నారు.
2018 ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన పథకం ఈ నెల 13వ తేదీతో ముగియనుంది. ఈ నెల 14 నుంచి 2020 ఆగస్టు 13 నాటికి పథకాన్ని రెన్యువల్ చేస్తున్నట్లు తెలిపారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి.
రైతు బీమా కోసం ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ప్రతిరైతుకు రూ.2,271 చొప్పున ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పటి వరకు 30,94,656 మంది రైతులు పథకంలో చేరగా రూ.704.16 కోట్ల ప్రీమియం కట్టింది.ఏడాది కాలంలో 15,027 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.751.35 కోట్ల పరిహారాన్ని ఎల్‌ఐసీ చెల్లించింది.
ఇక ఈ ఏడాది నుంచి రైతు పెట్టుబడి సాయాన్ని పెంచింది ప్రభుత్వం. గతంలో ఎకరాకు 4వేల చొప్పున రెండు పంటలకు రూ.8వేలకు అందించగా ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పంటలకు 10వేల రూపాయలను అందిస్తోంది ప్రభుత్వం.