గీత కార్మికుల సంక్షేమానికి నీరా పాలసీ: మంత్రి

283
Minister Srinivas Goud
- Advertisement -

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో కల్లు దుకాణాలలో భౌతిక దూరం పాటిస్తూ పార్సెల్ ద్వారా కల్లు అమ్మకాలకు అనుమతి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్‌ను కలసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే టీ రామారావుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు గీత వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేతి వృత్తులు, కుల వృత్తులకు పూర్వవైభవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రజక, నాయి బ్రాహ్మణులు, యాదవ మరియు ముదిరాజుల సోదరులకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వెనుకబడిన వర్గాల ఆత్మ గౌరవం కోసం కృషి చేస్తున్నారన్నారు మంత్రి.

తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తి ఎన్నో వందల సంవత్సరాలు చరిత్ర ఉందన్నారు. రాష్ట్రంలో గీత వృత్తి ద్వారా సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మంది కల్లు మరియు నీరా ప్రాజెక్టు వల్ల ఉపాధి పొందుతున్నారన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో గీత వృత్తిపై, కల్లు అమ్మకాలపై ఎన్నో ఆంక్షలను విధించారన్నారు. కల్లును నిషేదించే కుట్రలు జరిగాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లు అమ్మకాలకు అనుమతి ఇవ్వటంతో పాటు, కరోనా మహమ్మారి విస్తరించకుండా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో గీత వృత్తిదారుల సంక్షేమం కోసం కల్లు అమ్మకాలను భౌతిక దూరం పాటిస్తూ కల్లును పార్సెల్ ద్వారా అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కి దక్కిందన్నారు.

Srinivas Goud

గీత వృత్తిదారులు తాటి చెట్లు ఎక్కే క్రమంలో ప్రమాదానికి గురైతే 2 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు ఎక్సిగ్రేషియోను పెంచి గౌడ కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. గతంలో ఉన్న 10 కోట్ల బకాయిలను రద్దు చేయటంతో పాటు తాటి, ఈత చెట్ల పన్నును పూర్తిగా రద్దుచేసామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న ఎంతో విలువైన నెక్లెస్ రోడ్డు లో నీరా కేంద్రం ఏర్పాటుకు 3 కోట్ల రూపాయలతో ఇప్పటికే టెండర్లు పూర్తి చేశామన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఔషద గుణాలున్న నీరాను శీతల పానీయంగా తయారు చేసి… అందుకుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆధునిక హంగులతో కార్పొరేట్ తరహాలో నిర్మిస్తున్న ఈ నీరా కేంద్రంలో నీరా సరఫరాతో పాటు తాటి, ఈత చెట్ల ద్వారా తయారైన సంప్రదాయ ఉత్పత్తులను, ఔషధాలతో పాటు వెజ్ మరియు నాన్ వెజ్ లతో కూడిన తెలంగాణ సాంప్రదాయ వంటకాలను అందిస్తామన్నారు.

ఆధునిక నీరా కేంద్రాలను దశల వారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేస్తామన్నారు. సంప్రదాయ నీరా ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి గీత వృత్తి దారులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. నీరా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నో వ్యాధుల నివారణకు దివ్య ఔషధంగా ఆయుర్వేదంలో వాడుతున్నారన్నారు. గీత వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, కూన వెంకటేష్ గౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్,ప్రతాప్ లింగం గౌడ్, దొంతి లక్ష్మీ నారాయణ గౌడ్, భీష్మ గౌడ్, ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, అశోక్ గౌడ్, బాలరాజు గౌడ్ లతో పాటు వివిధ జిల్లాల గౌడ సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -