తెలంగాణకు మరోసారి 2 జాతీయ స్థాయి అవార్డులు..

201
telangana
- Advertisement -

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డుల పరంపర కొనసాగుతున్నది. సీఎం కేసిఆర్ నేతృత్వంలో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్వర్యంలో… రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టి అమలు చేస్తున్న అనేక పథకాలు అవార్డులను తెస్తున్నాయి. ఇప్పటికే స్వచ్ఛ భారత్, మంచినీటి సరఫరా, మిషన్ భగీరథ, పచ్చదనం, పారిశుద్ధ్యం తదితర ఉత్తమ అవార్డులు వచ్చాయి. ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ లు, ఉత్తమ మండల పరిషత్ లు, ఉత్తమ గ్రామ పంచాయితీ విభాగాల్లో అనేక అవార్డులు స్వంతం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి, మరో రెండు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.

ప్రపంచ టాయిలెట్స్ డే సందర్భంగా జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో SBM(G)విభాగంలో దేశంలోని ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన 20 జిల్లాలను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ 20 జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు ఉత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులను స్వంతం చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వ జ ల శక్తి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు రాసిన లేఖ ద్వారా తెలిపింది.

ఈ అవార్డులను కరోనా కారణంగా ఈ నెల 19న ప్రపంచ టాయిలెట్స్ డే రోజున ఉదయం 11:30 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ప్రధానం చేస్తామని కేంద్ర ప్రభుత్వ జల మంత్రిత్వ శాఖ ఆ లేఖలో పేర్కొంది. ఈ వర్చువల్ ఈవెంట్‌లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేస్తారని, రాష్ట్రం నుండి మంత్రి, రాష్ట్ర స్థాయి అధికారులు,అవార్డులు వచ్చిన జిల్లాల అధికారులు పాల్గొనాలని ఆ లేఖ ద్వారా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన SBM (G) విభాగంలో సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలకు అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయా జిల్లాల అధికారులను అభినందించారు. అలాగే సీఎం కేసిఆర్ ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నమనడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ అవార్డులే నిదర్శనమన్నారు. ఈ అవార్డులు మా శాఖ బాధ్యతల్ని మరింత పెంచాయని చెప్పారు. అవార్డులు రావడానికి తగిన ప్రోత్సాహం ఇస్తున్న సీఎం కేసిఆర్ కి, అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -