తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు అవుతున్న సందర్భంగా మూడు రోజుల పాటు ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది సర్కారు. జూన్ రెండు, మూడు, నాలుగు తేదీల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో చారిత్రాత్మక కట్టడాలతో పాటు రవీంద్ర భారతి, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, క్లాక్ టవర్ ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరీకరించనున్నారు. ఇక జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా జాతీయ జెండా ఎగరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
పరెడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ లపై కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28 రంగాల్లో అత్యత్తమ ప్రతిభ కనబరిచిన 52 మందికి రాష్ట్ర స్థాయి అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి కూడా సర్కారు అవార్డులను ప్రకటించింది. మొత్తం 31 జిల్లాల్లో 345 మందికి ఈ అవార్డులు ఇవ్వనున్నారు. రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలకు లక్షా నూట పదహారు రూపాయలు, జిల్లా స్థాయి అవార్డు గ్రహీతలకు 51 వేల 116ల నగదు పారితోషికాన్ని అందించనున్నారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా 417 మంది వృద్ధ కళాకారులకు 1500 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు.
వేడుకల్లో భాగంగా రాత్రి వేళ తెలంగాణ సంప్రదాయక వంటకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. గతంలో నెక్లె్‌సరోడ్‌లో ఏర్పాటుచేసిన ఫుడ్‌ఫెస్ట్‌ను ఈసారి బేగంపేటలోని పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేయనున్నారు. కొన్ని హోటళ్లలో చకినాలు, తలకూర, బోటిఫ్రై, పచ్చి పులుసు, వెజ్, నాన్‌వెజ్ వంటకాలను భోజనప్రియులకు వడ్డించనున్నారు. శిల్పారామంలోనూ వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగే రాష్ర్టావతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వేడుకలు జరుగుతాయని, ఈ సమయంలో ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి, వేడుకలు ఘనంగా జరగడానికి తోడ్పాటునందించాలని ఆయన కోరారు.
* సీటీఓ ఎక్స్ రోడ్ వైపు నుంచి పరేడ్ గ్రౌండ్ వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు బాలమ్‌రాయ్, తాడ్‌బండ్, మస్తాన్ కేఫ్, బ్రూక్ బండ్, టివోలి, స్వీకార్ ఉపకార్, ఎస్‌బీహెచ్, ప్యారడైజ్, ఎస్డీ రోడ్, ప్యాట్నీ, క్లాక్ టవర్, సంగీత్ జంక్షన్ల మీదుగా వెళ్లాలి.
* టివోలి ఎక్స్ రోడ్ నుంచి ప్లాజా వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బాలమ్‌రాయ్, సీటీఓ, ఉప్‌కార్, వైఎంసీఏల మీదుగా వెళ్లాలి.
* ప్యారడైజ్ క్రాస్ రోడ్ నుంచి ప్లాజా వైపు అనుమతి లేదు. ఈ వాహనాలను ప్యారడజైజ్, ప్యాట్సీ సెంటర్ల మీదుగా వెళ్లాలి.
* వైఎంసీఏ, సీటీఓ ైఫ్లైఓవర్లపై వాహనాలకు అనుమతి లేదు.
* ఎస్పీ రోడ్‌లోని సీటీఓ క్రాస్‌రోడ్ వైఎంసీఏ క్రాస్‌రోడ్డు మధ్య ఉదయం 7 నుంచి 10.30 గంటల మధ్య వన్ వే ఉంటుంది.
* ఎస్‌బీహెచ్ ఎక్స్ రోడ్ నుంచి వచ్చే వాహనాలు ఎస్‌పీ రోడ్ మీద నుంచి బేగంపేట్ వైపు అనుమతించరు. ఈ వాహనాలు ప్యాట్నీ, ఆర్‌పీ రోడ్, ప్యాట్నీ ప్యారడైజ్, స్వీకార్ ఉపకార్, టివోలి, బాలమ్‌రాయ్, సీటీఓ కార్యాలయం వైపు నుంచి వెళ్లాలి.