రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ జి.రాజేశంగౌడ్ నేడు జిహెచ్ఎంసి కార్యాలయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వివిధ విభాగాలు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో భాగంగా నేడు జిహెచ్ఎంసిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ రాజేశంగౌడ్ మాట్లాడుతూ ..విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరంలో జీవన ప్రమాణాల పెంపుకు, మౌలిక సదుపాయాలు ఇతర అభివృద్ది కార్యక్రమాలకు అధిక మొత్తంలో నిధులు అవసరం ఉన్నందున అంతర్గతలోటుపాట్లను సవరించుకుంటూ అదనపు నిధుల పెంపుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు.
అవసరమైతే దేశంలోని ఇతర కార్పొరేషన్లలో నిధుల సేకరణ విధానాలపై అద్యయనం చేయాలని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో హోటళ్లు, పెట్రోల్, వాహనాలు, అమ్మకాలు తదితర వ్యాపార కార్యకలాపాలపై స్వల్ప మొత్తంలో పన్ను విధిస్తే జిహెచ్ఎంసికి గణనీయ మొత్తంలో నిధులు సమకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో సిటీ శానిటేషన్ పేరుతో పన్నులు విధిస్తున్నారని, ఇదే అంశాలను పరిగణలోకి తీసుకొని వనరుల పెంపుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆక్ట్రాయ్, ప్రొఫెషనల్ ట్యాక్స్, మోటర్ వెహికిల్ ట్యాక్స్, ఎంటర్‌టైన్మెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ తదితర అంశాలను కూడా పరిశీలించాలని సూచించారు.
కాగా జిహెచ్ఎంసికి పన్నుల రూపెణ అందే నిధులను, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందాల్సిన నిధులపై కమిషనర్ లోకేష్ కుమార్ వివరించారు. హైదరాబాద్ నగరంలో 2002 సంవత్సరంలో నివాస భవనాలకు, 2007లో నాన్ రెసిడెన్షియల్ భవనాలకు పన్నులు పెంచడం జరిగిందని, అనంతరం ఇప్పటి వరకు పన్నుల పెంపులేదని వివరించారు. 14వ ఆర్థిక సంఘం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి జిహెచ్ఎంసికి అందిన నిధుల వివరాలను ఛైర్మన్‌కు వెల్లడించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.