వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సహాయంగా అందించే కాన్సెంట్ లెటర్ ను ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ కు అందించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని అందించనున్నారు. కేసీఆర్ ను కలిసిన వారిలో టిజివో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారాయణ, టిఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ ఉన్నారు.
డిఏ విషయంలో విధానం మార్చాలి: సిఎం
ప్రస్తుతం అనుసరిస్తున్న డిఏ విషయంలో విధానం మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ‘‘ప్రస్తుతం డిఏ ఎంత అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. దాన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం మూడు డిఏలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రెండు డిఏల విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కేంద్రం తీసుకునే నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తున్నది. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగులకు సకాలంలో డిఏ అందడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ప్రతీ ఆరు నెలలకు ఒక సారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డిఏ నిర్ణయించాలి. కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలి. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డిఏ ప్రకటించి అమలు చేయాలి. కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే మిగిలిన 0.5 శాతం చెల్లించాలి. 2.5 గా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి చెల్లించాలి. ఈ విషయంలో వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలి. కేబినెట్లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటాం’’ అని సిఎం వెల్లడించారు.త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, సమస్యలను పరిష్కరించునున్నట్లు సిఎం తెలిపారు.