మంత్రి చొరవతో పెరిగిన ఎస్‌ఎస్ఆర్ ధరలు..

45
- Advertisement -

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ పరిధిలో 25% నుండి 30% ఎస్‌ఎస్ ఆర్ ధరలు పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చొరవతో తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌తో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి చర్చలు జరిపారు. అనంతరం అసోసియేషన్ డిమాండ్ల పరిశీలన నిమిత్తం ఎనిమిది మందితో వేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదిక ననుసరించి యస్ యస్ ఆర్ ధరలను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. పట్టణ ప్రాంతాలలో 30% ,గ్రామీణ ప్రాంతాలలో 25% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఐదు సంవత్సరాల నుండి ఎస్‌ఎస్ఆర్ ధరల పెంపు కోసం నిరీక్షిస్తున్న మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, ప్రధాన కార్యదర్శి యస్ కే మాజిద్ లు పేర్కొన్నారు.

ఈ మేరకు శనివారం తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు పెద్దఎత్తున బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణానికి తరలివచ్చి రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.ఎస్‌ఎస్ఆర్ ధరల పెరుగుదల విషయంలో జోక్యం చేసుకుని కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌తో చర్చలు జరిపి ధరలు నిర్ణయించడంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాత్ర కీలకమైనది వారు కొనియాడారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రభుత్వానికి విద్యుత్ శాఖతోనే మంచి గుర్తింపు లభించిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నవినిర్ణయాలే కారణమని వారు తేల్చి చెప్పారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారిగా ధరలు రెట్టింపు కావడంతో విద్యుత్ కాంట్రాక్టర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారని, అదే సమయంలో మా బాధలు గుర్తించి యాజమాన్యాలతో మంత్రి జగదీష్ రెడ్డి చర్చలు నిర్వహించినందునే ఎస్‌ఎస్ఆర్ ధరలు పెరిగాయన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి జగదీష్ రెడ్డికి, ట్రాన్స్కో అండ్ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డిని అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యుత్ బోర్డ్ సభ్యులు సదానందం, పర్వతాలు, బిక్షమయ్య, బాలునాయక్, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, సత్తిరెడ్డి, జే. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -