డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ

3
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా పై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు. డిజిపి కార్యాలయంలో గురువారం నాడు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి బ్యూరో ఇంచార్జ్ సందీప్ శాండిల్య తో పాటు పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫరా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పకడ్బందీగా వ్యవహరించి డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. తెలంగాణ స్టేట్ ప్రత్యేక పోలీసు విభాగం నుంచి సిబ్బందిని అదనంగా బ్యూరోకి కేటాయిస్తామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలను సరఫరాలను పూర్తిగా నిషేధించాలని ఈ లక్ష్యం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అన్నారు. నిందితులను పట్టుకున్నప్పుడు వారి నెట్వర్క్ ను పూర్తిగా అరెస్ట్ చేయాలని అన్నారు. విదేశీయులు ఎవరైనా అనుమానాస్పదంగా డ్రగ్ వ్యవహారాల్లో తల దూర్చితే వారిని వెనక్కి పంపేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విద్యా సంస్థల వద్ద, అనుమానాస్పద ప్రాంతాల్లో బ్యూరో సిబ్బందిని నియమించాలని తద్వారా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ శ్రీ మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ…. నిందితులను పట్టుకోవడమే కాక వారికి శిక్ష పడేలా సాక్షాదారాలను న్యాయస్థానాలకు సమర్పించాలని సూచించారు . తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను పూర్తిగా నియంత్రించాలని అన్నారు. బ్యూరో ఇన్చార్జి శ్రీ సందీప్ శాండిల్య మాట్లాడుతూ…. సిబ్బందికి శిక్షణ ఇచ్చి, నిందితులను శిక్షించేందుకు అవసరమైన సమాచారాన్ని పుస్తకాల రూపంలో ముద్రించామని తెలిపారు. శిక్షపడేలాగా కఠినంగా వ్యవహరిస్తున్నామని, అదనపు సిబ్బందిని కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మున్ముందు మరింత నిక్కచ్చిగా చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -