తెలంగాణలో కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. “ఒరిజినల్ కాంగ్రెస్ vs ఎల్లో కాంగ్రెస్” పంచాయతీగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఫిరాయింపు నేతలతో తగాదాలు కొనసాగుతున్నాయి.
టీడీపీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల బిల్లులు విడుదల అవుతున్నాయని, మా లాంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల బిల్లులు ఎందుకు విడుదల అవ్వడంలేదంటూ ధిక్కార స్వరం వినిపించారు కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
బీఆర్ఎస్ నుంచి వచ్చి తనపై, తన కార్యకర్తలపై మేఘారెడ్డి పెత్తనం చెలాయిస్తున్నాడని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు వనపర్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి.
వనపర్తి నియోజకవర్గంలో తమను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా రానివ్వడం లేదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన మేఘారెడ్డి తన అనుచరులను మాత్రమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి రానిస్తున్నాడని క్షేత్రస్థాయి ఒరిజినల్, పాత కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు.
2023 ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి తమ ఇన్‌చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ ఒక్కసారి కూడా తన నియోజకవర్గానికి రాలేదని, కార్యకర్తలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అలాగే రేవంత్ రెడ్డి సహచర మంత్రులు కూడా తనతో వేగలేకపోతున్నారని, వాళ్లు బయటికి చెప్పలేకపోతున్నారని తెలిపారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇలా కీలకమైన నేతలంతా బహిరంగంగానే దూషించుకుంటుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read:రాఖీ..స్పెషల్ వంటకాలు!

