వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ శుభ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుమల చేరుకుని తెల్లవారుజామున వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ముఖ్యమంత్రి దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ దర్శన ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అనుకున్న సమయానికి ముందుగానే దర్శనాలను ప్రారంభించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టోకెన్లు ఉన్న భక్తులు ఇంకా 10 నుంచి 12 గంటల పాటు దర్శనం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టీటీడీ దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి శోభ అద్భుతంగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనానికి అవకాశం కల్పించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మజ్జిగ, బాదంపాలు పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంతో ఆలయ ప్రాంగణం భక్తితో నిండిపోయింది.
Also Read:న్యూజిలాండ్‌తో సిరీస్..బుమ్రా,హార్దిక్‌కు విశ్రాంతి!

