రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సినీనటుడు, తెదేపా సీనియర్ నేత హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఇందుకోసం నల్గొండ ప్రభుత్వాస్పత్రి నుంచి వైద్యుల బృందం కామినేనికి వచ్చింది. పోస్టుమార్టం అనంతరం హరికృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాద్ మెహదీపట్నంలోని ఆయన నివాసానికి తరలించారు.
ఇక హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులను సంప్రదించి అంత్యక్రియ ఏర్పాట్లను చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు.
ఇవాళ ఉదయం నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద రోడ్డుప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. హరికృష్ణ భౌతికకాయం వెంట బాలకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్, కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఉన్నారు. హరికృష్ణ పార్థివదేహం వెంట ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ బయల్దేరారు. తమ అభిమాన నటుడు, ప్రియతమ నేతను చూసేందుకు అభిమానులు భారీగా చేరారు. హరికృష్ణ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.