వీరే ఆ ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు..

301
- Advertisement -

వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లను నేడు సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. శనివారం రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని రంగారెడ్డి నుంచి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్‌ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు.

నల్గొండ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు చర్చకు వచ్చినా ఆయన శాసనసభ్యుల కోటా స్థానం కావాలని కోరుతున్నందున ప్రత్యామ్నాయంగా ఇతర నేతలు తేరా చిన్నపరెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, చకిలం అనిల్‌కుమార్‌, సుంకరి మల్లేశ్‌గౌడ్‌, వై.వెంకటేశ్వర్లులలో ఒకరికి అవకాశం ఇవ్వాలని యోచించినట్లు సమాచారం.

KCR

అయితే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాసకు సంపూర్ణ మెజారిటీ ఉందని, సునాయాస విజయం సాధిస్తామని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. మహేందర్‌రెడ్డి, గుత్తా, పోచంపల్లిల ఎంపికపై సానుకూలత వ్యక్తమవుతోందని, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అభ్యర్థులపై సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తే చిత్తుచిత్తుగా ఓడించి సత్తా చాటుతామని చెప్పారు. గతంలో అన్ని ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని అన్నారు. భారీ మెజారిటీతో ఎన్నికల్లో విజయానికి పకడ్బందీ వ్యూహాన్ని అవలంబించాలని ఆయన సూచించారు. మూడు జిల్లాల్లోనూ సమావేశం నిర్వహించి, సమన్వయం సాధించాలన్నారు. ఆదివారం ముగ్గురు అభ్యర్థులను పిలిచి బి-ఫారాలను ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు.

- Advertisement -