యాదాద్రి అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రూ.43కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న సీఎం… అనంతరం వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైటీడీఏకు 2,157 ఎకరాలు అప్పగిస్తామని, ఇందులో ఆలయ అర్చకులు, ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించనున్నట్లు తెలిపారు. దాతలు కాటేజీ నిర్మాణాలకు ఇచ్చే విరాళాలకు ఐటీ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ ఉండేలా అనుబంధ నిర్మాణాలు చేపట్టాలని వైటీడీఏను ఆదేశించారు. ఇందుకోసం 100 ఎకరాల్లో నృసింహ అభయారణ్యం ఏర్పాటు చేస్తామని, 50 ఎకరాల్లో కల్యాణ మండపం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 250 ఎకరాల్లో కాటేజీల నిర్మాణం చేపడుతామన్నారు. ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.