ఘనంగా సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..

66
- Advertisement -

అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో పాటు ఆయన చేపట్టిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటోంది తెలంగాణ సమాజం. ఆమరణ నిరాహార దీక్ష సమయంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినా కూడా తెలంగాణ సాధన కోసం పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడారు. తాను మరణించినా ఫర్వాలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు అనుకుని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తన మరణంతోనైనా సరే.. తెలంగాణ వస్తే చాలనుకున్నానని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతో 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ సచ్చుడో లేదంటే తెలంగాణ వచ్చుడో అంటూ కేసీఆర్‌‌ చేపట్టిన దీక్షకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ తర్వాత చాలా ఆటుపోట్లు ఎదురైనా కూడా నాలుగున్నర సంవత్సరాలకు తెలంగాణ కల సాకారమైంది. అలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు సాధించి పెట్టి.. ఎన్నికల్లో ప్రజా తీర్పుతో ఏడేళ్లుగా ముఖ్యమంత్రి పీఠంపై కేసీఆర్ కూర్చొంటున్నారు.

ఫిబ్రవరి 15 నుంచే తెలంగాణ వ్యాప్తంగా మొదలైన కేసీఆర్ జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. నేడు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ అంతటా సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. అలాగే అంతటా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంతేకాక టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

- Advertisement -