తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌తో ఉక్కిరిబిక్కరవుతున్న హస్తం నేతలకు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలవడం కాస్త ఊరటనిచ్చింది. అయితే ఈ ఆనందం వారికి ఎక్కువ సేపు నిలవలేదు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి హస్తం నేతలకు కొలుకోలేని షాకిచ్చారు.
దీనికి తోడు హస్తం పార్టీకి మరో షాక్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందే కాంగ్రెస్‌ఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరికతో టీఆర్ఎస్ బలం 101కి చేరుకోగా కాంగ్రెస్ బలం 19 నుండి 9కి పడిపోయింది.
మరో నలుగురు ఎమ్మెల్యేలను సమీకరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయేలా చేయడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీసి సునాయసంగా విజయం సాధించవచ్చని గులాబీ బాస్ భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా మూడింట రెండొంతుల మంది అంటే 14 మంది కలిస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదు. గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ ,ఇటీవల శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం ఇలాగే విలీనమైంది.
ఇదే వ్యూహాన్ని అమలు చేస్తూ పోలింగ్‌కు కంటే ముందే మరో నలుగురు ఎమ్మెల్యేలను సమీకరించి వెనువెంటనే వీలిన ప్రక్రియను పూర్తిచేసేలా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.ఇక కాంగ్రెస్‌లో మిగిలిన వారిలో భట్టి విక్రమార్క,గండ్ర వెంకటరమణారెడ్డి,సీతక్క,పోదెం వీరయ్య,పైలట్ రోహిట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,జగ్గారెడ్డి,శ్రీధర్ బాబు ఉన్నారు. దీంతో టీఆర్ఎస్‌లో చేరే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరా అన్నదానిపై రాజకీయవర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.