సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం 20 అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరుగుతున్న ఈ భేటీలో ప్రధానంగా కృష్ణా జలాల్లో వాటాపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, తర్వాత తీసుకోవల్సిన చర్యలపైనా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. ట్రిబ్యునల్ నిర్ణయంపై సుప్రీంకు వెళ్లే ఇష్యూపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.
మరోవైపు ప్రస్తుతం ఉన్నచోట కొత్త సచివాలయం నిర్మించాలన్న ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. తాత్కాలిక సెక్రటేరియట్ తరలింపుపైనా కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే సీఎస్ ఆధ్వర్యంలో అధికారులు తాత్కాలిక కార్యాలయాలను పరిశీలించారు. దీనిపై సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు. వీటితో పాటు కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల పనితీరు, అభివృద్ధి పనుల పర్యవేక్షణపై మంత్రుల నుంచి ఫీడీ బ్యాక్ తీసుకోనున్నారు సీఎం. కొత్త జిల్లాల్లో ఉద్యోగాల భర్తీపై కూడా చర్చించనుంది మంత్రివర్గం.
కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల HRA పై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 20శాతం HRA కావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 20శాతం, అంతకంటే తక్కువున్న ప్రాంతాల్లో 14.5శాతం HRA ఇస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ లో 30శాతం HRA పొందుతున్న వాళ్లలో కొందరు.. జిల్లా కేంద్రాలకు వెళ్లటంతో HRA కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అందరికీ సమానంగా 20శాతం HRA కావాలని కోరుతున్నారు ఉద్యోగులు. ఈ విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ ఇవ్వనుంది సర్కార్.