రాష్ట్ర సచివాలయంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభంకానుంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్ల పెండింగ్ డిమాండ్లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా రెండు కరువు భత్యం (DA) వాయిదాల విడుదలపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు పిఆర్సి (PRC) నివేదిక, ఉద్యోగుల బకాయిల చెల్లింపులు, ఇతర పెండింగ్ డిమాండ్లపై క్షుణ్ణంగా చర్చించనున్నారు.
రాజధాని రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రివర్గంలో కీలక చర్చ జరగనుంది. ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో ఉన్న మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియతో పాటు, మెట్రో ఫేజ్-2 విస్తరణ ప్రణాళికలపై కేబినెట్ సుదీర్ఘంగా సమాలోచనలు జరపనుంది.
Also Read:ఏపీ స్థానిక ఎన్నికలు..హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వీటితో పాటు రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల విడుదల తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు తెలిపాయి.

