సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం. మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ ప్రతిపాదనలతోపాటు కొత్త ప్రతిపాదనలను ఉంచాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.
ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి డజనుకుపైగా అంశాలను ప్రభుత్వం మంత్రివర్గం ముందు ఉంచబోతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం పెంపు, ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో టీఎంసీ నీరు తరలింపు, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ తదితర ప్రధాన అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి.
22 కొత్త జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల కోసం భూముల కేటాయింపు ప్రతిపాదనలను ప్రభుత్వం కేబినెట్ ముందుంచనుంది. అలాగే రుణ ఉపశమన కమిషన్ చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి. శారదా పీఠానికి కోకాపేటలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలా లేక ఫిట్‌మెంట్ వర్తింపజేయాలా అనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచే అంశంపై చర్చించనుంది మంత్రివర్గం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది