తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్య ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది.
వివేక్, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరిగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. రెడ్డి సామాజికవర్గం నుంచి చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే సమస్యలు వస్తాయని పూర్తిగా ఖాళీగా ఉంచుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కాకా వెంకటస్వామి కుమారుడు గడ్డం వివేక్. చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్… విశాఖ ఇండస్ట్రీస్ , మీడియా సంస్థనూ నిర్వహిస్తున్నారు. 2009లో పెద్దపల్లి నుండి ఎంపీగా గెలిచారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఆయన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. వివేక్ సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా, కుమారుడు వంశీ ఎంపీగా ఉన్నారు.
కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1965లో కరీంనగర్ జిల్లాలో జన్మించిన ఆయన, కాకతీయ మెడికల్ కాలేజీ నుండి MBBS, MS పూర్తి చేశారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఆయన కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి ..నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నుండి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి వాకిటి నరసింహులు రైతు. 2001-2006 మధ్య మక్తల్ గ్రామ సర్పంచ్‌గా, 2014-2018 మధ్య జెడ్పిటిసి సభ్యుడిగా పనిచేశారు. 2024లో సమగ్ర కుటుంబ సర్వే, బీసీ కుల గణన వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించారు.
Also Read:మైత్రి మూవీ మేకర్స్…’8 వసంతాలు’

