బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనిపై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానించింది.
తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) వివరాలు నమోదు చేసుకోవడానికి రెండోసారి ఇచ్చిన గడువు పూర్తయిన నేపథ్యంలో ఆ వివరాల ఆధారంగా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది.ఎస్సీ వర్గీకరణపై వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని మరోసారి అధ్యయనం చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నివేదికకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎస్సీ వర్గీకరణపై భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్ అవతల 2 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏను విస్తరించారు. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి.మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసును 18 ఏండ్ల నుంచి 15 ఏండ్లకు కుదింపు. అలాగే సంఘాల్లో కొనసాగడానికి గరిష్ట వయసును 60 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంపు.తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటుకు వీలుగా దేవాదాయ చట్టంలో సవరణలకు అమోదం తెలిపింది.
Also Read:ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్

