తెలంగాణ బడ్జెట్ – 2019..ఎంతో తెలుసా..?

256
kcr telangana budget
- Advertisement -

తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే శాఖల వారీగా అధికారుల నుండి నివేదిక తెప్పించుకున్న సీఎం..సుమారు రెండు లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి నాలుగో వారంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అవసరమయ్యే నిధులపై అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ.

బ‌డ్జెట్‌లో 50 శాతం కంటే ఎక్కువ నిధులు సంక్షేమానికే కేటాయిస్తుండటంతో కేంద్రం నుంచి నిధులు పెద్దగా రాకపోవడంతో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపులపై ఆర్థిక శాఖ తర్జనభర్జన పడుతోంది.అయితే ఈ సారి సంక్షేమానికే పెద్దపీట వేసేలా బడ్జెట్ ప్రణాళికలు చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇటీవలే పంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో.. గ్రామాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం.

మళ్లీ అధికారంలోకి వస్తే.. గతంలో ఇచ్చిన పింఛన్ల కంటే డబుల్ ఇస్తామని ప్రకటించారు కేసీఆర్. ఆ నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ సమావేశంలో పింఛన్ల గురించి ప్రస్తావించారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అమలు చేస్తామని చెప్పారు. ఆ మేరకు బడ్జెట్ లో ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 60 ఏళ్లు పైబడిన వారికి ఫించన్‌ అందిస్తుండగా దానిని 57 ఏళ్లకు తగ్గించారు. ఇప్పటివరకు పింఛన్ల కోసం బడ్జెట్ లో 5,043 కోట్లు కేటాయించేది ప్రభుత్వం. పింఛన్ల మొత్తం పెంచడం, అర్హత వయసు తగ్గించడంతో బడ్జెట్‌లో మరిన్ని నిధులను కేటాయించనుంది.

రైతుబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం ఈ ఏడాది నుంచి (రెండు పంటలకు) 10 వేల రూపాయలు కానుంది. దీనికి కూడా ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించనుంది సర్కార్. లక్ష లోపు రుణాల మాఫీకి 24 వేల కోట్లు అవసరమని గుర్తించారు. రుణమాఫీ కి అవసరమైన నిధులను గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా చెల్లించే విధంగా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ వ్యవహారాలన్ని స్వయంగా చూస్తున్న సీఎం కేసీఆరే ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించోబోతున్నట్లు టాక్‌.

2016-17లో లక్షా ముప్పైవేల బడ్జెట్‌ను,2017-18లో లక్షా 49 వేల కోట్లతో బడ్జెట్‌‌ ప్రవేశపెట్టింది సర్కార్. ఈసారి ఏకంగా 2 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

- Advertisement -