బీజేపీలో గందరగోళం..ఎవరి దారి వారిదేనా?

3
- Advertisement -

తెలంగాణ బీజేపీలో మునుపెన్నడూ లేని విధంగా గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎవరి దారి వారిదే అన్నట్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరి మధ్య సమన్వయం లేదు. అంతకు మించి సఖ్యత కూడా లేదు. అందుకే బీజేపీ పార్టీ అధ్యక్ష ఎన్నిక దగ్గరి నుండి కీలక పదవుల వరకు జాప్యం జరుగుతూనే ఉంది.

ప్రస్తుతం కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కిషన్ రెడ్డి. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటుండటంతో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేని పరిస్థితి.ఇక పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎవరికి సమాచారం సైతం ఉండటం లేదు. అందుకే ఎమ్మెల్యేలు తలోదారి వెతుక్కుంటున్నారు. ఇక బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి ఒక్కరే మాట్లాడుతుండగా ఆయనపై సైతం ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఎజెండా కాకుండా తన సొంత ఎజెండాను అమలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.

అందుకే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఇప్పటివరకు బీజేఎల్పీ సమావేశం జరిగింది లేదు. అసెంబ్లీలోనూ పార్టీ వాయిస్ పెద్దగా వినిపించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదు. తెలంగాణకు కేంద్రం కేటాయించిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించలేకపోతున్నారని కొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారు.

అసెంబ్లీ వ్యవహారమే కాదు చాలా విషయాల్లో రాష్ట్ర పార్టీకి, ఎమ్మెల్యేలకు మధ్య పూర్తిగా గ్యాప్ వచ్చిందని బీజేపీ నేతలే చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన రెండు కీలక సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే పార్టీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడుతూ వస్తుందని చెబుతున్నారు. మొత్తంగా కాషాయ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కార్యకర్తలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇలా అయితే భవిష్యత్‌లో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:లిప్‌లాక్ సీన్లపై ఐశ్వర్య..షాకింగ్ కామెంట్స్!

- Advertisement -