తెలంగాణలోని బీసీ ఓటర్లను ఆకర్శించేందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. సీట్ల కేటాయింపులో కూడా బీసీలకే అధిక ప్రాధాన్యం కల్పిస్తూ వచ్చింది. అంతే కాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతనే సిఎం చేస్తామని ప్రకటించింది. ఇలా బీసీ వ్యూహంతో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించగా అందులో ముగ్గురు బీసీలు మాత్రమే గెలుపొందారు. దీంతో బీసీ మంత్రాన్ని జపించి భంగపడ్డ కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. .
17 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలను దాటుకొని మెజారిటీ సీట్లు సాధించాలంటే బీసీలను మాత్రమే నమ్ముకుంటే నష్టం తప్పదని కమలనాథులు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది, దీంతో ఈసారి సీట్ల కేటాయింపులో కూడా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగాలని కమలనాథులు భావిస్తున్నారట. ఈసారి అన్నీ సామాజిక వర్గాలపై దృష్టి సారిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాషాయ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆధరణ కరువైంది.
అందుకే అన్నీ సామాజిక వర్గాలకు దగ్గరై ఓట్లు దండుకునే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోందట. తాజాగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రచారానికి సిద్దమయ్యారు కమలనాథులు. ఇక కేంద్రంలో ఈసారి 400కు పైగా సీట్లు సాధించే దిశగా టార్గెట్ నిర్దేశించుకుంది కాషాయ పార్టీ. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి రాష్ట్రంలోనూ మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. మరి తెలంగాణలో గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి పది సీట్లకు పైగా గెలవాలని చూస్తోంది. మరి బీజేపీని అన్నీ సీట్లు కైవసం చేసుకుంటుందా ? లేదా అసెంబ్లీ ఎన్నికల మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డీలా పడుతుందా అనేది చూడాలి.
Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?