100 డేస్ బీజేపీ వ్యూహం!

74
- Advertisement -

తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులు చేసిన తరువాత దూకుడుగా వ్యవహరించేందుకు సిద్దమౌతోంది. ఎన్నికలకు ఐదు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ ఐదు నెలల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఎన్నికల బరిలో నిలవాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి అధికారికంగా బాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన పార్టీ తదుపరి కార్యచరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాబోయే 100 రోజులు బీజేపీ నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కమలం పార్టీ నిర్ణయించింది. తాజాగా జరిగిన సమావేశంలో వంద రోజుల ప్రణాళికపై కసరత్తులు చేశారు కమలనాథులు. ఈ వంద రోజుల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సూచించారు..

ఈ నెలాఖరు లోగా ఎన్నికల కమిటీ వేసి పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని బీజేపీ భావిస్తోంది. కాగా కర్నాటక ఎన్నికల తరువాత తెలంగాణ బీజేపీలో కొంత దూకుడు తగ్గింది. నేతల్లో కూడా విభేదాలు తెరపైకి రావడంతో బీజేపీ అంతర్గతంగా సతమతమౌతోంది. ఈ నేపథ్యంలో పదవుల విషయంలో అధిష్టానానికి మార్పులు చేయక తప్పలేదు. కాగా ఎన్నికల ముందు మార్పులు చేసి బీజేపీ అధిష్టానం కొంత సాహసం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఐదు నెలల్లో మళ్ళీ కొత్త నాయకత్వంలో పార్టీ ముందుకు సాగాల్సి ఉంటుంది. మరి పార్టీని ముందుకు నడిపేందుకు అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డి 100 రోజుల వ్యూహానికి సిద్దమయ్యారు. మరి ఈ వంద రోజుల్లో బీజేపీలో ఏమైనా మార్పు వస్తుందా లేదా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుందా అనేది చూడాలి.

Also Read:పవన్ క్యారెక్టరే జగన్ టార్గెట్ ?

- Advertisement -