రాష్ట్ర శాసనసభకు సంబంధించి నాలుగు వెబ్‌సైట్‌లను ఈ రోజు ఆవిష్కరించారు. తెలుగు, ఉర్దూభాషల్లో వెబ్‌సైట్‌లతో పాటు డిపార్ట్‌మెంట్ సభ్యుల పోర్టల్స్ ఆవిష్కరించారు. తెలుగు వెబ్‌సైట్‌ను స్పీకర్ మధుసూదనాచారి, ఉర్దూ వెబ్‌సైట్‌ను శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మెంబర్స్ పోర్టల్‌ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. డిపార్ట్‌మెంటల్ పోర్టల్‌ను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన స్పీకర్ మధుసూదనాచారి రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లలోపే దేశంలోనే తొలిసారిగా తెలంగాణ శాసనసభ వెబ్ సైట్ ను ప్రాంతీయ భాషల్లో ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. తెలుగు, ఉర్దూ భాషలతో పాటు ఆంగ్లంలోనూ శాసనసభ వెబ్ సైట్ ప్రారంభంతో పారదర్శకత పెరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరును ప్రజలు తెలుసుకునేందుకు స్థానిక భాషల వెబ్ సైట్ ఎంతగానో ఉపకరిస్తుందని స్పీకర్ అన్నారు.
సభలో జరిగే చర్చలపై ప్రజలకు సమాచారం లభిస్తుందని, దేశంలో ఈ ప్రయత్నం మొదట మన రాష్ట్రంలోనే జరగడం గర్వకారణమని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. సభ్యుల లాగిన్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లో సమస్యలను ప్రజలు నేరుగా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోయేందుకు అవకాశం లభిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సభ్యులు, మంత్రులు, అధికారులకు అవసరమైన సమాచారం వెంటనే తీసుకునేందుకు ఈ వెబ్ సైట్ ఉపయోగపడుతుందన్నారు. త్వరలో నియోజకవర్గాల్లో అభివృద్ధి సమాచారాన్ని సైతం వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.