తెలంగాణలో ఆషాఢ మాస బోనాలు మన సంస్కృతిని, సంప్రదాయలను తెలియజేస్తాయని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద ఈ నెల 24 వ తేదీన జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు బోనాల పండుగను జరుపుకోలేదన్నారు. ఈ ఏడాది బోనాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 25వ తేదీన నిర్వహించే అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఖర్చును తెలంగాణా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బోనాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. సుమారు 3,500కు పైగా దేవాలయాలకు ప్రభుత్వం బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 24వ తేదీన బోనాలు నిర్వహించే దేవాలయాలకు రెండు మూడు రోజుల్లో చెక్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.