ఈ ఏడాది నుంచే కొండపోచమ్మ సాగర్ కు గోదావరి జలాలు

412
cmd Prabhakar Rao
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఈ ఏడాది నుంచే కొండపోచమ్మ సాగర్ వరకు తరలించడానికి అవసరమైన పంపింగ్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు ట్రాన్స్ కో-జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. రాజరాజేశ్వర స్వామి (మిడ్ మానేరు) రిజర్వాయర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్ని దశల్లో పంపు హౌజుల నిర్మాణం పూర్తి కావాలని, ఈ ఏడాది నుంచి నీటిని పంపు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని కోరారు. వచ్చే ఏడాది నుంచి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడు టిఎంసిలను, మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు రెండు టిఎంసిలను తరలించడానికి అవసరమైన విద్యురత్ సంబంధ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంపుహౌజులను సిఎండి ప్రభాకర్ రావు శుక్రవారం సందర్శించారు. నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంపుల ఏర్పాటు పనులు నిర్వహిస్తున్న సీమెన్స్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. అనంతసాగర్ (ప్యాకేజి 10), రంగనాయక సాగర్ ( ప్యాకేజి 11), మల్లన్న సాగర్ (ప్యాకేజి 12) పంపుహౌజులను, సబ్ స్టేషన్లను పరిశీలించారు. 424 మెగావాట్ల సామర్థ్యం (106×4) కలిగిన అనంతసాగర్ పంపులు, 536 మెగావాట్ల సామర్థ్యం (134.8×4) కలిగిన రంగనాయక సాగర్ పంపులు నీటిని పంపు చేయడానికి సిద్ధమయ్యాయి. వాటి పనితీరును సిఎండి పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. 344 మెగావాట్ల సామర్థ్యం(43×8) కలిగిన మల్లన్న సాగర్ పంపు హౌజులో 4 పంపులు పనిచేయడానికి కావాల్సిన విద్యుత్తు సంబంధిత పనులు పూర్తయ్యాయి. మిగతా నాలుగు పంపులకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పంపులకు విద్యుత్ సరఫరా చేయడానికి కావాల్సిన సబ్ స్టేషన్ నిర్మాణం, విద్యుత్ సరఫరా తదితర పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా నాలుగు పంపులను కూడా ఈ నెలాఖరులోగా బిగించాలని సిఎండి ప్రభాకర్ రావు అధికారులను ఆదేశించారు.

వచ్చే ఏడాది నుంచి మేడిగడ్డ నుంచి 3 టిఎంసిలను ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం పెట్టినందున, దానికి సంబంధించిన విద్యుత్ సరఫరా పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా మూడో టిఎంసిని ఎత్తిపోయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు, అవసరమైన విద్యుత్తును కూడా సమకూర్చుకోవడానికి తగిన కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. సిఎండి వెంట ట్రాన్స్ కో జెఎండి సి.శ్రీనివాసరావు, డైరెక్టర్ సూర్య ప్రకాశ్, ఇ.డి. ప్రభాకర్ రావు, ఎస్ఇ ఆనందర్, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి తదతరులున్నారు.

- Advertisement -