కోలీవుడ్‌లో స్టార్ హీరో విశాల్ మరోసారి సత్తాచాటాడు. తమిళ చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ ఎన్నికయ్యారు. ఇప్పటికే నడిఘర్ సంఘం జనరల్ సెక్రెటరీగా భాద్యతలు నిర్వర్తిస్తున్న విశాల్ తమిళ పరిశ్రమలోనే శక్తివంతమైన రెండు పదవులను చేపట్టినట్టైంది. ఉదయం 8: 30 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగిసిన పోలింగ్ లో 1,059 ఓటు పొలవగా విశాల్ తన ప్రత్యర్థి కోదండ రామయ్య పై 154 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో రజనీకాంత్, కమల్ హాసన్, రాధికా శరత్ కుమార్, సుహాసినీ మణిరత్నం, నాజర్ వంటి ప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తరపున పోటీచేసిన ప్రకాష్‌రాజ్, గౌతమ్ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్ ప్రభు (కోశాధికారి) కూడా గెలుపును సొంతం చేసుకున్నారు.
అధ్యక్ష పదవికి పోటీచేసిన విశాల్ 478, రాధాకృష్ణన్ 355, కేఆర్ 224 ఓట్లు సాధించారు. తొలి రౌండ్ నుండే విశాల్ ముందంజలో నిలిచి విజయం సాధించారు. నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విశాల్ మాట్లాడుతూ… ‘మార్పు కావాలనుకుంటే దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని తెలిపారు.
మా జట్టు అంకితభావంతో పనిచేస్తుందని…తమిళ పరిశ్రమలోని పైరసీపై గట్టి చర్యలు తీసుకుంటామని, రైతుల సమస్యలపై కూడా పనిచేస్తామని తెలిపారు. రాబోయే రెండేళ్లలో నిర్మాతల మండలి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేయడమే లక్ష్యం. తమిళ సినిమాకు మళ్లీ స్వర్ణయుగం తీసుకొస్తా’ అని విజయోత్సాహంతో ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే విశాల్ జట్టు సభ్యులు, మద్ధతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయం ఊహించిందేనని, తమిళ సినిమాకు యువతరం సేవలు అవసరమని ఈ ఎన్నికలతో మరోసారి నిరూపితమైందని వారు పేర్కొన్నారు.