సరిగ్గా 40 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ సంచలనం తెలుగుదేశం ఆవిర్భావం. ఎన్టీఆర్ స్ధాపించిన ఈ పసుపుజెండాతో ఎంతోమంది వెనుకబడిన వర్గాల వారు రాజకీయ ఆరంగేట్రం చేసి రాణించారు. ఇక ఇటీవలె పార్టీ అవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న టీడీపీకి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉనికికొల్పోయిన టీడీపీ ఇప్పుడు ఏపీలో సత్తాచాటేందుకు కనీసం ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఈ పార్టీ బీ ఫామ్ కోసం వెంపర్లాడిన నేతలంతా ఇప్పుడు పోటీ అంటేనే జంకుతున్నారు. ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తిరుగులేని మెజార్టీ కట్టబెట్టడంతో టీడీపీ పరువు పోయింది.
టీడీపీ స్ధాపించిన తర్వాత ఇంత ఘోరంగా ఓటమి పాలవడం ఆపార్టీకి ఇదే తొలిసారి. దీంతో నేతలంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈక్రమంలో రానున్న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ భవిష్యత్‌ను నిర్ణయించనుండగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సంగ్రామానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా సోషల్ మీడియాలో చంద్రబాబు,టీడీపీపై జోక్స్ పేలుతున్నాయి.
వరుస ఎన్నికల్లో ఓటములు ఎదురవుతున్న నేపథ్యంలో ఓడిపోవడం కంటే పారిపోవడమే బెటర్ అని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. వైసీపీ అభిమానులు సైతం టీడీపీ ఎన్నికల నుండి పారిపోవడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తుండగా నెటిజన్లు కూడా టీడీపీని ఓ ఆటాడుకుంటున్నారు.