పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్నంగా ఆలోచించి ప్రజల మనసులు గెలుచుకున్నారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ఎదుర్కొనే కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయనే స్వయంగా స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారారు. డెలివరీ సిబ్బంది రోజూ ఎదుర్కొనే సమస్యలు, పని ఒత్తిడి, ట్రాఫిక్ ఇబ్బందులు, సమయపాలన వంటి అంశాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
డెలివరీ బాయ్ టీషర్ట్ ధరించి, తన బుల్లెట్ బైక్‌పై నగర వీధుల్లో తిరుగుతూ పార్సిల్స్‌ను కస్టమర్లకు అందించారు. సాధారణ డెలివరీ బాయ్‌లాగే యాప్ ద్వారా వచ్చిన ఆర్డర్లను తీసుకుని, చిరునామాల వద్దకు వెళ్లి ఆహార పార్సిల్స్ డెలివరీ చేశారు. ఎమ్మెల్యేనే స్వయంగా తమ ఇంటికి వచ్చి పార్సిల్ ఇవ్వడంతో చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు సెల్ఫీలు తీసుకోగా, మరికొందరు ఈ ప్రయత్నాన్ని అభినందించారు.
Also Read:‘నారీ నారీ నడుమ మురారి’..ఆనందాన్ని ఇచ్చింది
డెలివరీ సిబ్బంది అనుభవిస్తున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత, వారి సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బోడె ప్రసాద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు కేవలం కార్యాలయాల్లోనే కాకుండా, ప్రజల జీవితాల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే చేసిన ఈ వినూత్న ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారి, విస్తృత ప్రశంసలు అందుకుంటోంది.

