టీడీపీ ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్‌ కలకలం!

1
- Advertisement -

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెడుతున్న వరుస వాట్సాప్ స్టేటస్‌లు, చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాన్ని తీవ్రంగా వేడెక్కించాయి.

తనకు సమాచారం ఇవ్వకుండా, కనీసం తెలియకుండానే నియోజకవర్గంలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడంపై కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉన్న తనకు తెలియకుండా అభివృద్ధి పనులు ప్రారంభించడమేమిటని ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను ఏ విధంగా చూస్తున్నారు?” అని ప్రశ్నిస్తూ ఆయన తన ఆవేదనను, ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై సొంత పార్టీ నేతల తీరును నిలదీస్తూ ప్రశ్నించడం గమనార్హం.

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక నేత పోతులా బాలకోటయ్యలతో తనకు ఉన్న పాత విభేదాల నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. మణిపాల్ ఆస్పత్రి వేదికగా తనపై కుట్రలు పన్నుతూ, పథకం ప్రకారం చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read:వైవా హర్ష ..లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

తనపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని కొలికపూడి హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేసేవారి ‘ఇంటికొచ్చి మరి నిలదీస్తా’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో వర్గపోరు పరాకాష్టకు చేరడంపై టీడీపీ క్యాడర్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఎన్నికలపై ఈ విభేదాల ప్రభావం పడకముందే పార్టీ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని, అంతర్గత పూసగుచ్చిన గొడవలను పరిష్కరించాలని స్థానిక శ్రేణులు కోరుతున్నాయి.

- Advertisement -