వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న టీడీపీ మరియు జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే రెండు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకున్నప్పటికి చాలా అంశాలు ఆ పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు, సిఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఇప్పటికీ కూడా క్లారిటీ రాలేదు. కాగా మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే నష్టం తప్పదని భావించిన ఇరు పార్టీల అధినేతలు పార్టీ కీలక అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల పవన్ చంద్రబాబు భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దాదాపు గంటన్నర పాటు సాగిన భేటీలో చాలా అంశాలపై విపులంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటులో అధినేతలిద్దరూ తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
టీడీపీ జనసేన కూటమిలో భాగంగా దాదాపు 20 సీట్లను జనసేన పార్టీకి కేటాయించినట్లు వినికిడి. అయితే మరో పది స్థానాలను పవన్ డిమాండ్ చేస్తునట్లు సమాచారం. మరి అందుకు చంద్రబాబు నుంచి సరైన సమాధానం రాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ నెల 20న యువగళం ముగింపు సభ ఏర్పాటు చేయనున్నారు టీడీపీ శ్రేణులు. ఈ సభకు పవన్, చంద్రబాబు హాజరవుతారని సమాచారం. ఈ సభలో సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక టీడీపీ జనసేన కూటమికి సంబంధించి సిఎం అభ్యర్థి ఎర్వరనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. సిఎం పదవే టార్గెట్ అని పవన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు. మరి పవన్ ను సిఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు చంద్రబాబు ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారా ? అనేది కూడా ప్రశ్నార్థకమే. మరి ఈ కన్ఫ్యూజన్ కు అధినేతలు ఎప్పుడు తెర దించుతారో చూడాలి.
Also Read:జగన్ టార్గెట్‌గా కాంగ్రెస్?