బండి సంజయ్‌లో టెన్షన్.. అసమ్మతి నేతల తిరుగుబాటు..

105
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చేసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఏమో కాని…ముందు సొంత జిల్లా కరీంనగర్‌లో ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత సైద్ధాంతిక విలువలు, హిందూత్వ భావజాలంతో నడిచే బీజేపీ భ్రష్టుపట్టిపోయిందని, వలస నేతలను పార్టీలో చేర్చుకుని బీజేపీలో కాంగ్రెస్ తరహా కల్చర్‌ను తీసుకువస్తున్నాడని, వలస నేతలకు ప్రాధాన్యం ఇస్తూ పాతనేతలను తొక్కేస్తున్నాడని ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన 100 మందికి పైగా బీజేపీ సీనియర్లు నిర్వహించిన రహస్యసమావేశం తెలంగాణ బీజేపీని కుదిపేసింది. సీనియర్ల తిరుగుబాటుతో బండి సంజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అయితే అసమ్మతి నేతల రహస్య సమావేశాలపై సీరియస్ అయిన బీజేపీ హైకమాండ్… సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దింపింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాకు చెందిన అసమ్మతినేతలను హైదరాబాద్‌‌కు రప్పించిన నల్లు వారితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడుతూ.. సీనియర్లను అవమానిస్తున్నాడని, అసలు ఈటల రాజేందర్ లాంటి నేతలను పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం ఏంటని అసమ్మతి నేతలు నిలదీశారు. అయితే బండి సంజయ్ సారథ్యంలోనే పార్టీ ఎన్నికలకు వెళుతుందని, ఇలాంటి టైమ్‌లో పార్టీ పరువును బయటపడేలా సీక్రెట్ మీటింగ్‌లు పెట్టద్దని అసమ్మతి నేతలకు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది. అయినా బీజేపీ సీనియర్లు హైకమాండ్ ఆదేశాలను లెక్క చేయకుండా హైదరాబాద్‌లో మళ్లీ బండికి వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపుగా అన్ని ఉమ్మడి జిల్లాలకుచెందిన కాషాయ సీనియర్లు పాల్గొనడం బండి వర్గానికి షాక్ ఇచ్చింది. మొదటి నుంచి కాషాయ జెండా మోస్తున్న సీనియర్లకు తీరని అన్యాయం జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సైతం అసమ్మతి నేతలు ఫిర్యాదు చేశారు. కాషాయ పార్టీలో కాంగ్రెస్ తరహా తిరుగుబాటులు మొదలవడంతో హైకమాండ్ తలపట్టుకుంది. అసమ్మతి నేతలపై వేటు వేస్తానని బండి సంజయ్‌ హెచ్చరించినా లెక్క చేయకుండా సీనియర్లు వరుసగా రహస్య సమావేశాలు నిర్వహించడంతో బీజేపీ పరువు పోయినట్లైంది.

పార్టీలో తన ఇమేజ్ రోజు రోజుకీ డ్యామేజ్ అవుతుండడంతో బండి సంజయ్ అప్రమత్తమయ్యారు. తాజాగా అసమ్మతి నేతలతో సంధి చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్, నల్లు ఇంద్రసేనా రెడ్డితో అసమ్మతి నేతలుగా ముద్రపడిన గుజ్జుల రామకృష్ణ రెడ్డి, అర్జున్ రావు భేటీ అయ్యారు. కాగా బండిపై తిరుగుబాటు చేసిన సీనియర్లపై వేటు వేయాలని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఈ చర్చలు జరగడంపై కాషాయ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీలో జరిగిన పరిణామాలు, సమాచార లోపాలపై పార్టీ పెద్దలకు కరీంనగర్‌ నేతలు గుజ్జుల, అర్జున్‌రావులు వివరించారు. ఎందుకు సీక్రెట్ మీటింగ్‌ పెట్టాల్సి వచ్చింది, అందులో ఏం చర్చించామనే విషయాలను వివరించినట్లు తెలుస్తోంది. కాగా పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగా చర్చించాలని, కాని తనకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు నిర్వహిస్తే…కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ముందు తన ఇమేజ్‌తో పాటు, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని బండి సంజయ్ గుజ్జుల, అర్జున్‌‌రావులను బతిమాలుకున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్నటి వరకు తిరుగుబాటు చేస్తే ఊరుకునేది లేదని, సస్పెండ్ చేస్తానని హూంకరించిన బండి సంజయ్ కాస్త వెనకడుగు వేసి అసమ్మతి నేతలతో భేటీ అవడం గమనార్హం.. మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇలా సీనియర్లతో కాళ్లబేరానికి రావడం ఇప్పుడు కాషాయ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -