తమిళ సూపర్ స్టార్ విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా బీస్ట్ సినిమాకు ముస్లిం వర్గాల నుండి నిరసన వ్యక్తమవుతోంది.
ముస్లింలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న దృశ్యాలను కారణంగా చూపిస్తూ కువైట్ ప్రభుత్వం “బీస్ట్” సినిమాను అక్కడ ప్రదర్శించకుండా నిషేధం విధించగా తమిళనాడులోనూ బీస్ట్‌ను బ్యాన్ చేయాలని తమిళనాడు ముస్లిం లీగ్ పార్టీ స్టాలిన్ సర్కార్‌ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు తమిళనాడు హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ముస్లింలను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తున్నదని… ముస్లింలను తీవ్రవాదులుగా చిత్రీకరించడం దురదృష్టకరమని, మతపరమైన సమస్యలకు ఇది కారణమని హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు హిట్‌గా నిలిచి సినిమాపై అంచనాలను పెంచేశాయి.