రెండేళ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే!

6
- Advertisement -

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందో, సర్కస్ నడుస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, అందర్నీ అక్కున చేర్చుకుని సంక్షేమ ఫలాలు అందించిన మహానేతగా ఆయనను కొనియాడారు. ఒక్కడిగా రాష్ట్ర సాధనకు బయలుదేరి, అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు.

అలాంటి సీనియర్ రాజకీయవేత్తపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అది ప్రపంచమంతా చూస్తోందని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసని, మంత్రులు కూడా అక్కడికి వెళ్లారని, అయినా సిట్ అధికారులు నంది నగర్ నివాసానికి వచ్చి గోడకు నోటీసులు అతికించడం అవమానకరమని ప్రశ్నించారు. చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని కేసీఆర్ చెప్పినా ఈ వేధింపులు ఎందుకని నిలదీశారు.

కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉంటే విచారణపై స్టే వచ్చేదని, అయినా చట్టాన్ని గౌరవించి హాజరవుతున్నారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో కాంగ్రెస్ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ వేధింపు రాజకీయాలకు నిరసనగా బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తోందని, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారని చెప్పారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తూ తీర్పు ఇచ్చారని, ఇప్పుడు వారే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గంలో దైవదర్శనం చేసుకోవడానికి వెళ్లినా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యేకు దేవుడిని మొక్కుకునే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు.

Also Read:కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు..బీఆర్ఎస్ నిరసనలు

కేసీఆర్ ప్రాణం పోయినా ఫర్వాలేదని ఉద్యమం చేసిన నాయకుడని, అలాంటి నేతపై ఇంతటి కక్ష సాధింపా అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కాంగ్రెస్ నేతలు గుర్తించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను గందరగోళంగా మార్చారని, పాలనా పద్ధతులు మార్చుకోకపోతే కాంగ్రెస్ తన ఖర్మ తానే అనుభవిస్తుందని హెచ్చరించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని, కాంగ్రెస్ ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలించాలని తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు.

- Advertisement -