కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం ఉందని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే అర్ధం అవుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన తలసాని..కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని..భట్టి విక్రమార్క అంత మేధావి ప్రపంచంలో లేడనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.కాళేశ్వరం ప్యాజెక్టు చూసి దేశమంతా గర్వపడుతుందన్నారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో తట్టెడు మట్టి కూడా తీయని దొంగలు…అతి తక్కువ సమయంలో పూర్తి అయిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పారు.ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఇంజనీర్ లాగా కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించారని చెప్పారు.అవినీతిలో కూరుకున్న పార్టీ లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.సీఎల్పీ నేతగా భట్టిని ఎన్నుకోవడం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదన్నారు.
దీక్షకు కూర్చున్న బట్టి రాహుల్ గాంధీ చెప్పాడని దీక్ష విరమిస్తే, రాహుల్ దీక్షా విరమణ గురుంచి చెప్పలేదు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం గాంధీ భవన్ లో పుట్టినట్టు మాట్లాడటం సరికాదన్నారు.కాంగ్రెస్ లో నాయకత్వం వీక్ అందుకే ప్రజలకు ఏదైనా చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే లు టీఆర్ఎస్‌లో చేరారని చెప్పారు. గురుకులల గురుంచి ఎప్పుడైనా కాంగ్రెస్ ఆలోచించిందా అని ప్రశ్నించారు. లక్ష మంది విద్యార్థులు గురుకులల్లో చదువుతున్నారని చెప్పారు.
నాలుగు పార్లమెంటు సీట్లు గెలిస్తే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎగిసి ఎగిసి పడుతున్నాడని మండిపడ్డారు.దేశంలోని కనీస వనరులను,నీటిని వాడుకోవాలని అందుకు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేసిన తలసాని పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలో గులాబీ జెండా మాది అని ప్రజలు తీర్పు ఇచ్చారు.
హైద్రాబాద్ ఉగ్రవాదులకు అడ్డ అని కిషన్ రెడ్డి అనడం ఎంతవరకు సమంజసమన్నారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు.ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలన్నదే తమ అభిమతమని అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ని,ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్షాల మైండ్ సెట్ మారితే వాళ్లను కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఆహ్వానిస్తామని చెప్పారు తలసాని.