రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం లబ్దిదారులకు నగదు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు మంత్రి తలసాని. దీనిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని..బీజేపీ చిల్లర రాజకీయాలను ఖండిస్తున్నామని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో గొర్రె పిల్లల పంపిణీ పథకం అమలవుతున్నదని అన్నారు. మునుగోడు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కుల వృత్తులకు పునర్‌వైభవం తీసుకురావడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నాయని చెప్పారు. త్వరలో హైదరాబాద్ నగరంలో ఉపఎన్నిక వస్తుందన్న వార్తలు అవాస్తవమని చెప్పారు.