చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, సెల్ఫీలతో సెగలు పుట్టించేవారు చాలామందే ఉన్నారు. ఇప్పుడు లైఫ్‌లో ‘సెల్’ ఓ భాగమైతే.. ‘సెల్ఫీ’ అలవాటుగా మారింది. ఇన్నాళ్ళూ అలవాటుగానే సెల్ఫీలు తీసుకుంటున్నాం అని చెప్పుకునే వాళ్ళకి ఇప్పుడో షాకింగ్ న్యూస్. సెల్ఫీ అలవాటు కాకుండా..జబ్బుగా మారుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
సెల్ఫీలు తీసుకోవడం ఓ మానసిక వ్యాధి అని 2014లోనే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకటించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఎంత మాత్రం నిజముందో తెలుసుకోవాలని లండన్‌కి చెందిన నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ, తమిళనాడుకి చెందిన త్యాగరాజన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లు సంయుక్తంగా అధ్యయనం చేపట్టాయి. ఈ అధ్యయనంలో వారు సెల్ఫీలు తీసుకోవడమనేది ఓ మానసిక జబ్బు అని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఆ జబ్బు స్థాయిని అంచనా వేయడానికి ‘సెల్ఫీటిస్ బిహేవియర్ స్కేల్’ని కూడా రూపొందించారు.
ఈ స్కేల్లో బార్డర్‌లైన్, అక్యూట్, క్రోనిక్ అనే మూడు విభజనలు ఉన్నాయి. రోజులో ఆరు కంటే ఎక్కువ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారందరూ క్రోనిక్ సెల్ఫీటిస్ కిందకి వస్తారని అధ్యయనంలో పేర్కొన్నారు. భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన దాదాపు 734 మంది విద్యార్థినీవిద్యార్థులను సర్వే చేసి, వారిలో దాదాపు 400 మందికి సెల్ఫీటిస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం కోసం భారతీయ విద్యార్థులను ఎంచుకోవడానికి ఓ అర్థం ఉంది. ఇక్కడే ఎక్కువ మంది ఫేస్బుక్ వినియోగదారులు ఉండటం, సెల్ఫీ మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉండటంతో అధ్యయనాన్ని ఇక్కడ చేపట్టారు.