తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఇందులో పలు రాష్ట్రాలుకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోడీతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్కారు పనితీరుని ప్రత్యేకంగా మెచ్చుకున్నారట.
జీఎస్టీ బిల్లును తొలుత ఆమోదించిన రాష్ట్రం తెలంగాణే అన్న మోడీ.. జీఎస్టీ బిల్లు తొలి దశలోనూ తెలంగాణ ఇదే చొరవను ప్రదర్శించిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉచిత ఎరువుల పథకాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ కూడా ప్రశంసించారు. రైతులకు రుణమాఫీ ఇవ్వటం కంటే.. వ్యవసాయ పెట్టుబడి తగ్గించేలా ఎరువుల్ని ఉచితంగా అందించటం.. సాంకేతికతను అందుబాటులోకి తేవటం మంచిదన్నారు. రాయితీపై వ్యవసాయ పనిముట్లను అందజేయాలన్న ఆయన.. రుణమాఫీ సరికాదన్నారు.
2022కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమం సహా పలు అంశాలపై నీతిఆయోగ్ మంగళవారం మూడేళ్ల కార్యాచరణను ప్రకటించింది. పలు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల ధోరణిని కనబరిచారు.
సాగు రుణాల మాఫీ రాష్ట్రాల పరిధిలోని అంశమని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు. రుణమాఫీ అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందన్నారు. ఒకవేళ రుణమాఫీ చేయాలనుకుంటే రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధానాన్ని రూపొందించటం, దాన్ని అమలు చేయటం, అవసరమైన సాంకేతికతను అందించటమే తమ బాధ్యతన్నారు.