T20 Worldcup:దాయాదుల పోరు ఎప్పుడంటే?

4
- Advertisement -

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూపుల ఖరారు పూర్తయింది. భారత్, శ్రీలంక ఆతిథ్యమిచ్చే ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగనుంది. ముఖ్యంగా భారత్–పాకిస్తాన్ మరోసారి ఒకే గ్రూప్‌లో ఉండటంతో టోర్నమెంట్‌కు భారీ హైప్ ఏర్పడింది. గ్రూప్ దశలోనే కాకుండా సూపర్–8, సెమీఫైనల్స్, ఫైనల్‌లో కూడా భారత్–పాక్ తలపడే అవకాశం ఉంది.

ఈసారి టోర్నమెంట్‌ను ఐసీసీ నాలుగు గ్రూపులుగా విభజించింది. ప్రతి గ్రూప్‌లో ఐదు జట్లు ఉండగా, టాప్ రెండు జట్లు సూపర్–8కు, తర్వాత సెమీస్, ఫైనల్‌కు చేరుకోనున్నాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఉన్న గ్రూప్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్‌ఏ ఉన్నాయి. పేపర్‌పై భారత్–పాక్ స్పష్టమైన ఫేవరెట్స్‌లా కనిపిస్తున్నప్పటికీ, 2024లో పాక్‌పై యూఎస్‌ఏ చేసిన సంచలన విజయం ఈ గ్రూప్‌కు ప్రత్యేకత తీసుకొచ్చింది.

భారత్ యూఎస్‌ఏతో తొలి మ్యాచ్ ఆడుతుంది. తర్వాత నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుంది. భారత్–పాక్ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించేందుకు ఐసీసీ ఇప్పటికే ప్రత్యేక తేదీ కేటాయించింది.

ఇతర గ్రూపుల్లో పోటీ తీవ్రత భిన్నంగా ఉంది. ముఖ్యంగా శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమాన్‌లతో అత్యంత క్లిష్ట గ్రూప్‌లో పడింది. మరో గ్రూప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉన్నాయి. చివరి గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్, యుఏఈ, కెనడా ఉన్నాయి.

మ్యాచ్ వేదికల విషయానికి వస్తే భారత్‌లో ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. శ్రీలంకలో కొలంబో, కాండీ వేదికలు సిద్ధంగా ఉన్నాయి. ఫైనల్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు యోచిస్తున్నప్పటికీ, పాకిస్తాన్ చేరితే కొలంబో ఫైనల్ వేదికగా మారే అవకాశం ఉంది. అధికారిక డ్రా నవంబర్ 25న ముంబైలో విడుదల కానుంది.

Also Read:Winter Walk:మీ ఊపిరితిత్తులకు హాని చేస్తోందా?

- Advertisement -