మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన చిత్రం సైరా. రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో వివిధ భాషల్లో గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సైరాతో చిరు ఎలాంటి మ్యాజిక్ చేశాడు…?సైరాతో సురేందర్ రెడ్డి మెప్పించాడా లేదా చూద్దాం..
కథ:
రేనాడు ప్రాంతాన్ని 61 మంది పాలెగాళ్లు చిన్న చిన్స సంస్థానాలుగా చేసుకుని పాలన సాగిస్తుంటారు. రేనాడుపై పన్ను వసూలు చేసే హక్కు ఆంగ్లేయులు పొందడంతో ఎవరికీ స్వయం పాలన ఉండదు. వర్షాలు లేక,పంటలు పండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు పన్నుల కోసం ఆంగ్లేయులు ప్రజలను హింసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మజ్జారి నరసింహారెడ్డి(చిరంజీవి) ఆంగ్లేయులపై ఎలా పోరాటం చేశాడు…? నరసింహారెడ్డికి ఎవరు సహకారం అందించారు…?చివరకు ఆంగ్లేయులపై నరసింహారెడ్డి పోరాటం ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను ఎలా రగిలించింది అనేదే సైరా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ చిరంజీవి నటన,సాంకేతికత,ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు,కథనం. తన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు చిరు. స్వాతంత్య్ర సమరయోధుడిగా చిరు నటన సినిమాకే హైలైట్. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో మెగాస్టార్ నటనకు ఫిదా కావాల్సిందే. కుర్ర హీరోలు సైతం అబ్బురపడేలా నటించి తన మార్క్ చూపించారు. సైరా భార్యగా నయనతార చక్కగా ఒదిగిపోయింది. సైరా ప్రియురాలిగా తమన్న సినిమాకు మరింత అందం తీసుకొచ్చింది. అమితాబ్,సుదీప్,జగపతి బాబు,రవి కిషన్,విజయ్ సేతుపతి నటనకు వంక పెట్టలేం. పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్,నాగబాబు మాటలు మెగా ఫ్యాన్స్‌ని మరింతగా ఆకట్టుకుంటాయి.
మైనస్ పయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ తెలిసిన కథ,ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు. అతి చిన్నదైన సైరా సైన్యం 10 వేల మంది ఆంగ్లేయ సైన్యాన్ని చంపడం కొంత లాజిక్‌కి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. స్టైలీష్ దర్శకుడిగా పేరున్న సురేందర్ రెడ్డి మెగా ఫ్యాన్స్ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా,చరిత్రకు ప్రాధాన్యమున్న కథను అద్భుతంగా మలిచాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ సూపర్బ్. సినిమాకు ప్రాణం పోసింది. అమిత్ త్రివేది సంగీతం సినిమాకు మరో అట్రాక్షన్.ఫైట్స్ సూపర్బ్. ఎడిటింగ్ బాగుంది. బుర్రా సాయిమాధవ్ డైలాగ్‌లు పేలాయి. ఇక చివరిగా రామ్ చరణ్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. పరుచూరి బ్రదర్స్ అందించిన కథకు మెరుగులు దిద్ది అద్భుతమైన విజువల్ వండర్‌గా సైరాను తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. చిరంజీవి నటన,సాంకేతికత సినిమాకు ప్లస్ కాగా ప్రారంభ సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే మూవీ సైరా.
విడుదల తేదీ:02/10/12
రేటింగ్:3/5
నటీనటులు: చిరంజీవి,అమితాబ్,నయనతార,తమన్నా
సంగీతం: అమిత్ త్రివేది
నిర్మాత: రామ్ చరణ్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి