మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్ సేతుతి, నయనతార, తమన్నా, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో…
విజయ్ సేతుపతి మాట్లాడుతూ – “అమితాబ్ బచ్చన్, చిరంజీవి వంటి గొప్ప స్టార్స్‌తో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో భాగం కావడంపై చాలా సంతోషంగా ఉంది“ అన్నారు.
తమన్నా మాట్లాడుతూ – “ఇది హిస్టారికల్ మూవీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైనది. సైరాలో నేను పార్ట్ కావడంపట్ల చాలా సంతోషంగా ఉన్నాను. సైరా నరసింహారెడ్డి సినిమా చరిత్రలో మనలో చాలా మందికి తెలియని ఓ స్వాతంత్ర్యయోధుడి కథ. ఇలాంటి సినిమాలో నటించడం చాలా గర్వంగా ఆనందంగా ఉంది“ అన్నారు.
సుదీప్ మాట్లాడుతూ – “బిగ్గెస్ట్ స్టార్ బిగ్ బిగారు ఈ సినిమాలో నటించారు. సినిమాలో స్టార్స్ సాధించిన వాటితో పోల్చితే మేం ఏం సాధించలేదు. అలాంటి వండర్ ఫుల్ యాక్టర్స్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడమే గొప్ప వరంగా భావిస్తున్నాను. ప్రతిరోజు మేం మేకప్ వేసుకుని అద్దంలో చూసుకున్నప్పుడు మేమేనా అనిపించేది. ఎందుకంటే పెద్ద పెద్దగడ్డాలు, బరువైన దుస్తులు, మేకప్ వేసుకునేవాళ్లం. యుద్ధ సన్నివేశాల్లో నటించేటప్పుడు మేం ఇతర నటీనటుల్ని కలుసుకుంటే వారెవరో తెలుసుకోవడానికే మాకు సమయం పట్టేది. చాలా గొప్ప సినిమా. ప్రతిసారి ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశాలు రావు. అవకాశం వచ్చినప్పుడు కాదనకుండా చేసేయడమే“ అన్నారు.
సురేందర్ రెడ్డి మాట్లాడుతూ – “ నా వెనుక చిరంజీవిగారు, చరణ్‌గారు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చేయగలిగాను“ అన్నారు.
పర్హాన్ అక్తర్ మాట్లాడుతూ – “నేను సినిమా ప్రపంచంలోనే ఎక్కువగా బ్రతికాను. ప్రపంచంలో మంచి చిత్రాల కలెక్షన్స్ మా ఇంట్లో ఉండేవి. సినిమాలకు భాషలేదు“ అన్నారు.
నిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ – “నాన్నగారు ఇంట్లో ఒకలా, మేకప్ వేసుకున్నప్పుడు ఒకలా ఉంటారు. ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతారు“ అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ – “ఇది చరిత్ర మరచిపోయిన వీరుడు `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` కథ. ఇలాంటి వీరుడి కథను మన దేశంలోని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. ఒకటిన్నర దశాబ్దంగా సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. అందుకు కారణం బడ్జెట్ పరిమితులే. సురేందర్ రెడ్డి, చరణ్ ఈసినిమాను చేయడానికి ముందు రావడంతో నా కల నేరవేరింది“ అన్నారు.