సాయిబాబా దేవుడెలా అయ్యాడు…?

315
- Advertisement -

ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మరోసారి సాయిబాబా..ఆయన భక్తులపై మండిపడ్డారు.సనాతన ధర్మం ప్రకారం.. భూత ప్రేత పిశాచమైన సాయిబాబాను పూజించడం తగదని అన్నారు. హిందువులు పవిత్రంగా పారాయణ చేసుకునే గ్రంథాలను సాయి బాబా భక్తులు.. ఆయన గ్రంథాలుగా పేర్కొనడం సరికాదన్నారు. కేవలం ధనార్జన కోసమే సాయి భక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. అసలు సాయిబాబా దేవుడేలా అయ్యారని…. సాయి భ‌క్తులు ఆందోళ‌న చేసే బ‌దులు త‌మ‌తో చర్చ‌కు రావాలని అన్నారు.

త్వరలో షిర్డీలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠంపజేసి వారి అజ్ఞానాన్ని పారదోలుతామని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం కడతామని ప్రకటించినా, మందిర నిర్మాణాన్ని ఏ పార్టీ చేపట్టలేదని గుర్తుచేశారు. రిజర్వేషన్ల పేరిట ప్రజలను విచ్ఛిన్నం చేసి లబ్ది పొందేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. మోదీ ప్రధాని కాక ముందు దేశం మొత్తం సంపూర్ణ గోవధను నిషేధిస్తామని చెప్పారు కానీ, ఇంత వరకూ అది కార్యరూపం దాల్చలేదని స్వరూపానంద సరస్వతి పేర్కొన్నారు.

sai

హిందూ పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లో రామాయ‌ణం, గీత నేర్పించాలని, అప్పుడే మ‌హిళ‌ల‌పై దాడులు త‌గ్గుతాయని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద అన్నారు. పాకిస్థాన్ నుంచి భార‌త్‌కు ర‌వాణా అవుతున్న డ్ర‌గ్స్ వ‌ల్ల కూడా ఇక్క‌డి యువ‌త పాడ‌వుతున్నార‌ని అన్నారు. భార‌తదేశంలో జ‌రుగుతున్న గోవ‌ధ‌లు పూర్తిగా ఆగిపోవాలనే ల‌క్ష్యంతో తాము ప‌నిచేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో రిజ‌ర్వేష‌న్ల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారని, ఏ వ‌ర్గానికీ రిజ‌ర్వేష‌న్లు ఉండ‌కూడ‌దని ఆయ‌న అన్నారు. కులం, వ‌ర్గం ఆధారంగా ఉండే రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయాలని అన్నారు.

గతంలో కూడా అనేకసార్లు సాయిబాబాపై స్వరూపానంద అనేక ఆరోపణలు చేశారు. సాయిబాబా ఓ ముస్లిం అని, ఆయన గొడ్డు మాంసం తినేవాడని ఆరోపించారు. తన వద్దకు స్వస్థత కోసం వచ్చే బాధితుల కోసం సాయిబాబా ఫతీహా చదివేవారని తెలిపారు. ‘సబ్ కా మాలిక్ ఏక్’ అన్న నినాదం గురునానక్‌ దని, సాయిబాబా చెప్పింది కాదని అన్నారు. హిందూ ఆలయాల్లో సాయి ప్రతిమలు పెట్డాన్ని ప్రభుత్వం వ్యతిరేకించాలని ద్వారకా పీఠాధిపతి కోరారు. ఆయన సాయి ట్రస్ట్ పైనా విమర్శలు గుప్పించారు. ట్రస్ట్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల నుంచి వసూలైన వందల కోట్ల సొమ్మును వివిధ బ్యాంకుల్లో దాచారని ఆరోపించారు.

- Advertisement -